Saturday, 19 May, 2007

 

అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

పల్లవి:
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా

పాట:
ఆత్మ వినాశాపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా


శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం


నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా


అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా


నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా


కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువుని చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే


సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం
తెలిసీ భుజం కలిపి రారేం


అలాటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి


ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం


జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా!
ఓ అనాథ భారతమా!! .....................అర్థ...



అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
వెలుగుని తప్పుకు తిరగాలా?


శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
అన్నల చేతిలో చావాలా?


తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే


నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా.................అర్థ...



తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తూందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా
ఓ విషాద భారతమా ......................అర్థ...

Labels:


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]