Tuesday, 5 June, 2007
ఒక క్షణంలో
ఒక క్షణంలో
మనస్సులో ఏదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఎదో మతి వికాసించి,
క్షణంలో
అదే పరుగు
మరేడకో...
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరపుల మడతలలో
కనబడక!
ఒక క్షణంలో
పూర్వపు సఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని కళలు కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కనులవెనుక తెరముందర
కనిపించి,
మరుక్షణం
విడివడి మరేడకో-
వడివడి మరేడకో!
ఒక క్షణంలో
సకల జగం!
సరభస గమనంతో....
పిమ్మట నిశ్శబ్దం
ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్మ్రోగును
హుటిహుటి పరుగెత్తే
యుగాల రథనాదం.
Labels: sri_sri_maha_prasthanam
Subscribe to Posts [Atom]